MeeBhoomi Village Adangal Removed: మీ-భూమి అనే డిజిటల్ భూమి రికార్డుల పోర్టల్ నుంచి గ్రామ అడంగల్ ఆప్షన్‌ను పూర్తిగా తొలగించేశారు. ఈ విషయాన్ని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. జయలక్ష్మి ఒప్పుకున్నారు. వారి వివరణ ప్రకారం… డేటా దోపిడీని అడ్డుకోవడం, పైరసీ చేసే వాళ్ల చేతిలో సమాచారం పడకుండా ఉండటమే లక్ష్యమని చెబుతున్నారు.
ఈ ఏటి ఏప్రిల్-మే నెలల్లో కొన్ని ప్రైవేటు యాప్‌లు, అనధికారిక వెబ్‌సైట్లు మీ-భూమి నుంచి పెద్ద ఎత్తున డేటాను కాపీ చేసుకున్నట్టు గుర్తించామని శాఖ అంటోంది. అందుకే బల్క్ డౌన్‌లోడ్ సౌకర్యాన్ని నిలిపేశామని, మళ్లీ అదే పొరపాటు జరగకూడదని గ్రామ అడంగల్‌ను పూర్తిగా దాచేశామని వివరణ ఇస్తున్నారు.
కానీ ఈ సమాధానం చాలా మందికి నమ్మశక్యంగా అనిపించడం లేదు. గత జగన్ ప్రభుత్వంలో ప్రభుత్వ భూములు, అసైన్‌మెంట్ భూములు, ఇనాం భూములు ఎవరికి వారు కట్టబెట్టే కుట్రలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలోనే కొంతకాలం గ్రామ అడంగల్‌ను దాచారట. కూటమి ప్రభుత్వం వచ్చాక దాన్ని తిరిగి ప్రజలకు అందుబాటులో పెట్టారు. ఎందుకంటే… ఆ రికార్డుల ద్వారానే అక్రమాలు బయటపడ్డాయి.
For more updates join in our whatsapp channel
ఇప్పుడు మళ్లీ 2025 ఏప్రిల్ నుంచి ఆ ఆప్షన్ మాయమైంది. రాష్ట్రం క్లౌడ్ టెక్నాలజీలో ముందుంటూ, సైబర్ సెక్యూరిటీలో దేశంలోనే ముందువరుసలో ఉంటూ… కేవలం కొన్ని యాప్‌లు డేటా దొంగిలించాయని చెప్పి, ప్రజలకు అతి ముఖ్యమైన గ్రామ అడంగల్‌ను బ్లాక్ చేయడం వింతగా కనిపిస్తోంది.
సాంకేతిక నిపుణులు ఒక్కమాటలో అంటున్నారు – “సైబర్ దాడి జరిగిందని ప్రజల డేటాను పూర్తిగా దాచేయడం సరైన పరిష్కారం కాదు. బదులుగా సెక్యూరిటీని బలోపేతం చేయాలి.” ఇలా చేయడం వల్ల పారదర్శకత దెబ్బతింటుందని, ప్రజలకు అందవలసిన సమాచారం అందకుండా పోతుందని విమర్శలు వస్తున్నాయి.
చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడూ డిజిటల్ పారదర్శకత, పౌర సేవలు, సురక్షిత డేటా అని చెబుతూ వచ్చింది. కానీ డేటా దొంగతనం జరిగిపోతుంటే… దాన్ని ఆపలేక, మొత్తం సేవనే ఆపేయడం సరైన నిర్ణయమా? ఈ ప్రశ్న ప్రజల మనసుల్లో తగ్గడం లేదు.